ప్రధానిని ప్రశ్నించి తీరతా

  • సోషల్ మీడియా దాడికి అనురాగ్ కాశ్యప్ స్పందన
  • సరిహద్దుల్లో పోరాడి దేశభక్తిని చాటుకోమని విమర్శకులకు సలహా
  • భారత్-పాక్ వాణిజ్యాన్ని ఎందుకు నిషేధించలేదని ప్రశ్న

ముంబై: తన ఎ దిల్ హై ముష్కిల్  సినిమాతో అంతులేని కష్టాల్లో ఇరుక్కున్న కరణ్ జోహార్ కు మద్దతు తెలిపిన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇప్పుడు సోషల్ మీడియా దాడికి పెద్ద లక్ష్యంగా మారాడు. కరణ్ జోహార్ సినిమాను విడుదల చేయకూడదని థియేటర్ యజమానులు తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి అనురాగ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నిరసన జ్వాలలు రేగాయి.

పాకిస్తాన్ నటుడితో సినిమా తీయడమే కరణ్ జోహార్ తప్పయినప్పుడు, గత ఏడాది డిసెంబర్ 25న ప్రధాని మోడీ పాక్ ప్రధానిని కలసుకోడానికి లాహోర్ వెళ్లినందుకు కూడా సారీ చెప్పాలని అనురాగ్ అన్నాడు. ఆయనలా ప్రధానిని ఇందులోకి తీసుకురావడంపై  ట్విట్టర్ పై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అనురాగ్ స్పందిస్తూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. ప్రధానిని ప్రశ్నించే హక్కు తనకు ఉందనీ, నా ప్రభుత్వం నుంచి నాలాంటివారికి రక్షణ ఆశిస్తాను కనుకే అలా అన్నానని స్పష్టం చేశాడు.  రెండు దేశాల మధ్య కోట్ల విలువైన వాణిజ్యం సాగుతూనే ఉందనీ, దానికి ఎలాంటి వ్యతిరేకతా లేదనీ, కానీ మమ్మల్ని మాత్రం మూల్యం చెల్లించుకోమనడాన్నే ప్రశ్నించానన్నాడు. “నా దేశభక్తిని ప్రశ్నిస్తూ ఇక్కడ కేకలు పెట్టడం కాదు, సరిహద్దుల దగ్గర పోరాడో, మరో గౌరవప్రదమైన పద్ధతిలోని ముందు మీ దేశభక్తిని నిరూపించుకోండి” అని విమర్శకులకు సలహా ఇచ్చాడు. “యెస్, నరేంద్ర మోడీ రక్షణ మాకు కావాలి. ఇప్పటికైనా ఆయన జోక్యం చేసుకోవాలి. ప్రధానమంత్రితో మాట్లాడలేని, ఆయనను ప్రశ్నించలేని, ఆయననుంచి రక్షణ ఆశించలేని స్థితిలో ఈ అంధ భక్తులు సృష్టిస్తున్న ఈ భయపూరిత వాతావరణంలో జీవించడానికి నేను నిరాకరిస్తున్నాను” అన్నాడు. “నిన్ను వార్తలలోకి ఎక్కించే” ఈ నకిలీ జాతీయవాదంతో ప్రధానిని ఆకట్టుకునే బదులు ఈ ప్రశ్నల్ని నేరుగా ఆయననే అడుగుతానన్నాడు.

Leave a Reply

Your email address will not be published.