డెంగ్యూ బారినపడ్డ విద్యాబాలన్

బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ కు డెంగ్యూ సోకినట్లు తాజాగా నిర్దారణ అయింది.  ప్రస్తుతం జుహు తారా రోడ్డులోని సొంత ఇంటిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. డెంగ్యూ కలిగించే ఎడెస్ ఏ ఈజిప్టీ జాతి దోమల నిరోధానికి మార్గదర్శకాలు పాటించనందుకు విద్యాబాలన్ ఇరుగుపొరుగు వారిపై బీఎంసీ కొరడా ఝుళిపించింది. అంతేకాదు ఓ హీరోకు ఫైన్ కూడా పడింది.

విద్యాబాలన్ కు డెంగ్యూ సోకడమేంటి.. షాహిద్ కపూర్ కు ఫైన్ పడటమేంటి.. రెంటికీ ఏం సంబంధం.. అంతా గందరగోళంగా అనిపిస్తోంది కదా. ఇందులో తమాషా ఏమీ లేదు. అన్నీ నిజాలే. చిన్నా పెద్దా,  పేద ధనిక అని తేడా లేకుండా అందరినీ వణికిస్తున్న డెంగ్యూ వ్యాధి బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ను సైతం సోకింది. తీవ్రమైన జ్వరం రావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా విద్యాబాలన్ డెంగ్యూ బారిన పడ్డ విషయం వెల్లడైంది.

ముంబయి జుహు తారా రోడ్డులోని సొంత ఇంటిలోనే వైద్యుల పర్యవేక్షణలో విద్య విశ్రాంతి తీసుకుంటోంది. ఐతే విద్యాబాలన్ ఉండే ఆపార్ట్మెంట్లో డెంగ్యూ దోమల నిరోధం విషయంలో ఉదాసీనంగా ఉన్నందుకు, నిబంధనలు పాటించనందుకు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కొరడా ఝులిపించింది.

విద్యాబాలన్ ఉండే అపార్ట్మెంట్ లోనే కింద గ్రౌండ్ ఫ్లోర్లో మరో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఉంటున్నాడు. షాహిద్ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అందులో చాలారోజులుగా నీళ్లను మార్చలేదు. దాని వల్ల డెంగ్యూ దోమలు వృద్ధి చెందాయని అధికారులు గుర్తించారు. దీంతో అతడికి అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు జరిమానా కూడా విధించారు. నెల రోజులుగా ముంబయిలో డెంగ్యూ వ్యాధి తీవ్రమవుతోంది. సెప్టెంబరు నెలలోనే 1500కు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. కొందరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో చికిత్స కూడా పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.