సమాజ్ వాదీ రజితోత్సవంలో … కలవని సరిగమ రాగాలు

లక్నో: కొద్ది నెలల్లో ముంచుకొస్తున్న ఎన్నికలు. ఉత్తరప్రదేశ్ లోని అధికార పక్షం సమాజ్ వాదీ పార్టీలో సయోధ్య అందనంత దూరంగానే కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భవించి పాతికేళ్లు అయిన సందర్భంగా శనివారం లకోనలో జరిగిన బహిరంగ కార్యక్రమంలో ఎక్కడా సయోధ్య ఛాయలే కనిపించలేదు. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేశ్ యాదవ్, ఆతని పినతండ్రి, పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు శివపాల్ యాదవ్ ల మధ్య రాజీ కుదర్చడం ఇప్పట్లో సాధ్యం కాదనే వాస్తవాన్ని వేదిక సాక్షిగా నిర్ధారణ అయింది.

ప్రసంగాల తీరు ఎలా ఉన్నా వేదిక మీద పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్, ముఖ్యమంత్రి అఖిలేశ్, పార్టీ రాష్ట్ర నేత శివపాల్ యాదవ్, వారికి ఇప్పుడు సమీప బంధువుగా మారిన రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇతర నాయకులందరికన్నా ముందు వరుసలో ఉన్నారు. కానీ, అఖిలేశ్, శివపాల్ మధ్య ఎడమొగం పెడమొగంనే ఉన్నారు. ములాయం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. ఈ పరిస్థితిని గమనించిన లాలూ తానే చొరవ తీసుకున్నాడు. అఖిలేశ్ ను వేదికపైనే పినతండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు కోరాల్సిందిగా ప్రేరేపించాడు. అదే సమయంలో ముభావంగా ఉన్న శివపాల్ ను ఆయన శివపాల్ కు మరోమార్గం లేకుండా సయువ సీఎంను ఆశీర్వదించేలా చేశాడు. ఈ రకంగా పైకి అంతా బాగానే ఉన్నట్టు ప్రజలకు ఒక సంకేతం అయితే అందించగలిగాడు.

ఈ క్రమంలో అఖిలేశ్ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా సభాముఖంగా పినతండ్రి పాదాలు పట్టుకునే పరిస్థితి  కల్పించిన విషయం గమనించి తీరాలి. ఇది చాలదన్నట్టు అఖిలేశ్ మంత్రివర్గంలోని జావేద్ అబిది మాట్లాడేందుకు వచ్చినప్పుడు శివపాల్ ఆతడి చేతుల్లోంచి మైకు లాగేసుకున్నాడు. ఆయన చేసిన నేరం తమ ముఖ్యమంత్రి అఖిలేశ్ ను గురించి గొప్పగా మాట్లాడడమే. శివపాల్ అక్కడితో ఆగలేదు. అఖిలేశ్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో సయోధ్య అసాధ్యమనే విషయాన్ని స్పష్టం చేసింది. శివపాల్ తన ప్రసంగంలో “కొంత మందికి వారసత్వం కారణంగా ఏ కష్టం పడకుండా ఎలాంటి శ్రమ పడకుండానే అతి తేలికగా అందలం ఎక్కిస్తుంది. మరెందరో ఏళ్ల తరబడి చమటోడ్చి పనిచేయడమే కానీ, వారికి అమీ దక్కదు ” అన్నారు. అక్కడితో ఆదలేదు. “ మీరు కావాలంటే ఎన్ని సార్లయినా నన్ను సస్పెండ్ చేయండి. ఎన్ని రకాలుగా అయినా అవమానించండి. కానీ మన నేత ములాయంను మాత్రం అగౌరవపరిస్తే అంగీకరించేది లేదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి. నేను ఇన్నేళ్లలో ఎంతో కష్టపడ్డాను. మీ కంటే చాలా ఎక్కువే సాధించాను. “ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

అంతసేపూ ముఖ్యమంత్రి అఖిలేశ్ ముఖం మీద చిరునవ్వు చెదరకుండా కనిపిస్తూనే ఉన్నా లోపల రగులుతున్న మంటలు అర్థమవుతూనే ఉన్నాయి. తన వంతు రాగానే ఆయన కూడా చురకలు వదిలారు. ఆ సభలో ఆయనకు అభిమానులు బహూకరించిన కత్తిని పైకెత్తి చూపిస్తూ అవసరమైతే దానిని ఉపయోగించేందుకు వెనుకాడనని అన్నారు. ఆయన భావం శివపాల్ అనేది స్పష్టవముతూనే ఉంది.

Leave a Reply

Your email address will not be published.