శాతకర్ణికి భారీగా బిజినెస్
స్టార్ హీరో ఉంటే చాలు, ఆ పిక్చర్ పై మొదటి నుంచి అంచనాలు పెరిగిపోతాయి. అదివరకు సోషల్ మూవీస్ కు భారీ అంచనాలుండేవి. ఇప్పుడు అలా కాదు, చారిత్రక సినిమాలకు కూడా హైప్ బాగా వస్తోంది. సినిమా మేకింగ్ లో ఉండగానే బిజినెస్ అయిపోతోంది. ఒక టాప్ స్టార్, ప్రమాణాలక విలువ ఇచ్చే డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమాకు అప్పుడే బిజినెస్ అయిపోయిందని టాక్.
ఇటీవల వచ్చిన టీజర్ అంచనాల్ని మరింత పెంచింది. చిత్రం బిజినెస్ స్పీడందుకుంది. అది ఎంత స్పీడంటే, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బిజినెస్ క్లోజైనట్టు తెలిసింది. ఒక సినిమా మేకింగ్ లో ఉండగానే దాని పెట్టుబడికి తగ్గట్టు బిజినెస్ అయిపోవడం విశేషం.
బాలకృష్ణ 100వ సినిమా శాతకర్ణి కి ఇప్పటికే బిజినెస్ పూర్తి కావడంతో, ఆ సినిమా పెట్టుబడి, లాభాలు ఏ విధంగా ఉన్నాయన్న విషయాలపై మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. మొదట ఈ సినిమా పై 40 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే, సామాన్యంగా ఏ సినిమాకైనా ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఎంతో కొంత పెరగడం మామూలే. ఆ విధంగా చూస్తే మరో 5 కోట్లు పెరగవచ్చని అంటున్నారు.
నైజాంలో గ్లోబల్ సినిమాస్, సీడెడ్, వైజాగ్ ఏరియాలను వారాహి బ్యానర్, ఈస్ట్‌లో సురేష్‌బాబు- వారాహి, వెస్ట్ లో ఎల్.వి.ఆర్ కృష్ణా, నెల్లూరులో భరత్, గుంటూరులో యస్ మూవీస్ సుధాకర్ ఈ సినిమా హక్కులు తీసుకున్నట్టు నిర్మాతలు సాయిబాబా, రాజీవ్‌రెడ్డి చెప్పారు. ఎంత బిజినెస్ జరిగిందీ ఇప్పటికి ఖచ్చితంగా లెక్కలు తెలీకున్నా మొత్తానికి 55-65 కోట్ల మధ్య ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు చెబుతున్నారు.