అత్త పాత్రలో ఆమెకు ఆమె సాటి

కొన్ని పాత్రలకు కొందరు కరెక్ట్ గా సరిపోతారు. అసలా కేరక్టర్స్ చేయడానికే వారు పుట్టారా అనిపిస్తుంది. అలనాటి  సూర్యకాంతం కూడా ఆ కోవకు చెందిన నటి. అత్తగారు అంటే సూర్యకాంతమే అన్నంతగా ఆమె పాపులర్ అయ్యారు. ఆంధ్రుల అత్తగారుగా పేరు పొందిన ఆమె … గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరు. అక్టోబర్ 28 సూర్యకాంతం జయంతి. ఈ సందర్భంగా ఆమెకు `ప్రైమ్ పోస్ట్` నివాళులర్పిస్తూ  అందిస్తున్న ప్రత్యేక కథనం.

సూర్యకాంతం అంటే సినిమాల్లో కోడళ్లకు హడలే. కోడలిని రాచిరంపాన పెట్టడంలో సూర్యకాంతం ఫస్ట్. అత్తగారిగా చేయాలంటే సూర్యకాంతమే చేయాలి అన్నంత పేరు తెచ్చుకున్నారు. మరో నటి ఇంతవరకు ఆ పాత్ర చేయలేకపోయిందనడం అతిశయోక్తి కాదు. మనకు పురాణ పాత్రలు వేసిన వారున్నారు. సాంఘిక పాత్రలు వేసిన వారున్నారు. కానీ అత్తగారి పాత్రల్లో రాణించిన వారు మరెవరూ లేరు.

సినిమాల్లో అత్తగారిగా కోడలిని హడలగొట్టి గయ్యాళిగా పేరుపడిన సూర్యకాంతం నిజజీవితంలో మంచి మనసున్న మనిషి.  తెర పై నటించిన పాత్రకు, నిజ జీవితంలో సూర్యకాంతానికి పోలికే లేదు. ఆమెది జాలి గుండె. మంచి మనసు. ఎందరికో సాయం చేసింది. అంతేకాదు… షూటింగ్ ఉంటే ఆమె స్వయంగా వండి ఇంటి నుంచి కేరియర్ తెచ్చి స్వయంగా వడ్డించేది.

గయ్యాళి పాత్రలకు పేరుపడిన సూర్యకాంతం మొదటి సినిమాలో మూగదానిగా నటించడం విశేషం. ఆమె అత్తగారి పాత్రలే కాదు. మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు, వెలుగునీడలు, మూగమనసులు వంటి సినిమాల్లో హాస్య పాత్రలూ వేసింది.  ఇక ఆమె పాత్ర పేరుతో వచ్చిన గుండమ్మకథ సినిమా అయితే చెప్పక్కర్లేదు. ఆ చిత్రంలో నాగేశ్వరరావు, రామారావు, ఎస్వీరంగారావు వంటి హేమాహేమీలున్నా  100 శాతం మార్కులు సూర్యకాంతానికే  పడ్డాయి. ఆమె పాత్ర పేరే సినిమాకు పెట్టడం అన్నిటికంటే గొప్ప విశేషం.

సూర్యకాంతం ధరించిన పాత్రలను చూస్తే ఆమెలా నటించేవారు మరొకరు పుట్టరేమో అనిపిస్తుంది. ఆమెకు ఆమే సాటి అనిపించుకుంది. అలాంటి నటీమణులు చాలా అరుదు. తెలుగు సినిమాకు సూర్యకాంతం ఒక వరం. తెలుగు ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం.

Leave a Reply

Your email address will not be published.