దేశభక్తికి వెల కట్టారా?: షబానా

కరణ్ జోహార్ సినిమా ఏదిల్ హై ముష్కిల్ సినిమా వివాదం ఇంకా సాగుతూనే వుంది. మొన్నటి వరకు సినిమా రిలీజ్ విషయంలో నానా కష్టాలు పడి ఎట్టకేలకు విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే సినిమా రిలీజ్ విషయంలో రాజ్ థాకరే చేసిన స్టేట్ మెంట్ వివాదంగా మారింది. దానిపై షబానా ఆజ్మీ విరుచుకుపడింది.

ఉరీ ఘటన తరువాత భారత్ పాకిస్థాన్ ల మధ్య యుద్దవాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జరిగిన ఈ ఘటన వేడి బాలీవుడ్ వరకు తగిలింది. పాక్ నటులను, టెక్నీషియన్లను బాలీవుడ్ సినిమాల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని వివిధ సంఘాలు వార్నింగు ఇచ్చాయి. అనుకున్నట్టుగానే ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదల విషయంలో అడ్డుపడ్డారు కూడా.

ఈ పరిణామాల నేపథ్యంలో ‘యే దిల్ హై ముష్కిల్’ విడుదల విషయంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఏ ఆటంకాలు లేకుండా చిత్ర ప్రదర్శన జరిగేట్టు చూస్తామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు. మరో వైపు మహారాష్ట్రలో సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాకుండా ఉండేందుకు కరణ్ జోహార్ సీఎం ఫడ్నవీస్, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేను కలిసారు. ఇకపై పాక్ నటులతో సినిమాలు చేయబోమని బాలీవుడ్ నిర్మాతల సంఘం తీర్మానించింది.

సీఎం, రాజ్ థాకరేతో చర్చల అనంతరం ప్రస్తుతానికి ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమా విషయంలో మినహాయింపు ఇవ్వాలని, సినిమా ద్వారా వచ్చిన ఆదాయంలో 5 కోట్లు సైనికుల సంక్షేమ నిధికి అందజేస్తామని నిర్మాతలు ప్రకటించారు. పాక్ నటులతో ఇప్పుడు సినిమాలు తీస్తున్న మిగతావారు కూడా  ఆర్మీ వెల్‌ఫేర్ ఫండ్ కింద 5 కోట్లు ఇవ్వాలని ఎమ్‌ఎన్‌ఎస్ షరతు విధించింది. దీనిపై బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ ఘాటుగా స్పందించారు.

సీఎం ఫడ్నవిస్ సినిమాకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విడుదల చేయించాల్సిందిపోయి ఇద్దరి మధ్య 5 కోట్లకు బ్రోకరింగ్ డీల్ కుదుర్చడం ఏమిటని మండిపడ్డారు. సీఎం ఫడ్నవిస్ దేశభక్తిని 5 కోట్లకు కొనుక్కున్నట్టా? అని నిలదీశారు.మరి ఈ విషయమై రిలీజ్ లోపు ఇంకెన్ని వివాదాలు తలెత్తుతాయో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published.