రాగాల వనంలో గానాల కోయిల

సంగీతం ఒక సుమధుర తరంగం. గానం ఆ తరంగానికి జీవం పోస్తుంది. సంగీత గానాలు అవినాభావ సంబంధం కలవి. ఒకటి శ్రుతి అయితే మరొకటి స్వరం. సంగీత దర్శకుల ఊహలకు, బాణీలకు అనుగుణంగా పాడాలి. అలా అవగాహనతో  ఎన్నో మధుర గీతాల్ని సుమనోజ్ఞంగా ఆలపించిన గాయని పి. సుశీల. నవంబర్ 13 ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు.

స్వరశాల, మధుర గాన రసలీల పి. సుశీల. సినిమాల్లో హీరోయిన్ కు పాడాలంటే .. .. సుశీలే పాడాలి, సుశీల పాడితేనే వినసొంపుగా ఉంటుంది అన్న ముద్ర పడిన గాయని పి. సుశీల. గాయనిగా ఆమె బహుదూరం ప్రయాణించారు. 50 ఏళ్ల సినీజీవితంలో సుశీల పాడిన పాటలు వేలలోనే ఉన్నాయి.

సుశీల స్వరంలో జిమ్మిక్కులు ఉండవు. సాఫీగా, లలితంగా… ఒకే గ్రాఫ్ తో  పాడడం ఆమె ప్రత్యేకత. ఆమె స్వరం కొన్ని సందర్భాల్లో మంద్రంగా ఉంటుంది. మరికొన్ని చోట్ల సాధారణ స్థాయిలో ఉంటుంది. ఒకే స్థాయి స్వరంతో  వేల పాటలు పాడి మెప్పించడం సుశీలకే చెల్లింది. ఉచ్చైస్వరంలో ఆలపించగలిగినా  ఆమె మరీ పీక్ రేంజ్ లో పాడడం చాలా అరుదు.

గొంతులో స్థాయీ భేదాలు  అంతగా లేనప్పటికీ సుశీల ఉచ్చారణ విశిష్టమైంది. స్పష్టమైన ఉచ్చారణ, కవి రాసిన భావానికి, సంగీత దర్శకుడు కట్టిన బాణీకి న్యాయం చేస్తూ పాడడం సుశీల ప్రత్యేకత. ఆమె ఎన్నో భాషల్లో గానామృతాన్ని పంచారు. ఏ భాషలో పాడినా .. .. అద్భుతమైన కంఠస్వరంతో , ఉచ్చారణతో – అది తన మాతృభాషే అన్నట్టు పాడడం సుశీలకే చెల్లింది.

సుశీల అద్భుతమైన గాన వాహిని నిరంతరం సాగాలని కాంక్షిస్తూ…

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published.