బాబును వెంటాడుతున్న ‘వోటుకు నోటు’

  • హై కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన టిఎస్, ఏసీబీ

హైదరాబాద్: ‘వోటుకు నోటు’ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నదనీ, ఆ కేసును మూసివేయలేదనీ తెలంగాణ ప్రభుత్వ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) హై కోర్టుకు తెలియజేసింది. నిందితులు నిర్వహించిన పాత్రను బయటపెట్టడానికి క్షుణ్ణమైన దర్యాప్తు జరుపుతున్నామని చెప్పింది. గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వై ఎస్ ఆర్ సీ పీ నాయకుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ కోర్టు తనకు వ్యతిరేకంగా ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టుకున్న పిటిషన్ పై ఏసీబీ దర్యాప్తు అధికారి మల్లా రెడ్డి కౌంటర్-అఫిడవిట్ దాఖలు చేశారు.

2న జారీ అయిన ఏసీబీ ఉత్తర్వుపై హై కోర్టు స్టే ఇస్తూ, ఈ విషయంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయవలసిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని, మంగళగిరి ఎమ్మెల్యేను ఆదేశించింది. ఈ కుంభకోణంలో నాయుడి పాత్రపై దర్యాప్తు జరపవలసిందిగా అంతకుముందు ఏసీబీని ఏసీబీ కోర్టు ఆదేశించింది. హై కోర్టు ఇచ్చిన స్టే ను తొలగించవలసిందని కోరుతూ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించిన సుప్రీం కోర్టు  నాలుగువారాల లోపల కేసుపై నిర్ణయం తీసుకోవాలని హై కోర్టును కోరింది. బుధవారం ఈ అంశం జస్టిస్ టి. సునీల్ చౌదరి ఎదుట విచారణకు వచ్చినప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే, ఏసీబీ ప్రతినిధి దాఖలు చేసిన కౌంటర్లకు సమాధానం ఇవ్వడానికి మరి కొంత సమయం కావాలని చంద్రబాబు నాయుడి తరపు న్యాయవాది కోర్టును కోరారు.

 ‘వోటుకు నోటు’ కేసులో నాయుడికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి తనకు లోకస్ స్టాండీ ఉందని ఆళ్ళ రామకృష్ణా రెడ్డి తన కౌంటర్-అఫిడవిట్ లో అన్నారు. ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా నేరచర్యలకు పాల్పడినప్పుడు ఆ విషయాన్ని న్యాయస్థానాల దృష్టికి తెచ్చే హక్కు దేశంలోని ఏ వ్యక్తికైనా ఉందని డా. సుబ్రమణ్యం స్వామి వర్సెస్ డా. మన్మోహన్ సింగ్ కేసులో సుప్రీం కోర్టు స్పష్టం చేయడాన్ని ఆయన హై కోర్టుకు గుర్తు చేశారు. పిటిషనర్ (నాయుడికి)కు హై కోర్టులో రద్దు పిటిషన్ దాఖలు చేసే హక్కు లేదని ఆయన వాదించారు. అవినీతి నిరోధక చట్టం కింద ఒక కేసు దర్యాప్తు దశలో ఉన్నప్పుడు నిందితుడు కేసు రద్దును కోరుతూ పిటిషన్ పెట్టుకోరాదని సుప్రీం కోర్టు అనడాన్ని ఆయన ప్రస్తావించారు. అవినీతి నిరోధక చట్ట ఉల్లంఘనకు, లంచం తీసుకోవలసిందిగ ప్రోత్సహించినట్టు ఒక వ్యక్తి పై  వచ్చిన ఆరోపణకు సంబంధించిన కేసుల్లో ఎట్టి పరిస్థితిలోనూ స్టే ఇవ్వరాదని ఆయన వాదించారు.

Leave a Reply

Your email address will not be published.