నిర్మలా కాన్వెంట్ ఆడియో రిలీజ్

హైదరాబాద్:  ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న ‘నిర్మలా కాన్వెంట్’ సినిమా ఆడియో రిలీజ్ వేడుక గురువారం సాయంత్రం ఇక్కడ అట్టహాసంగా జరిగింది. హీరో నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ నిర్మాతలుగా ‘మేట్రిక్స్ టీమ్ వర్క్స్’ పతాకంపైన అన్న పూర్ణ స్టూడియోస్, కాన్సెప్ట్ ప్రొడక్షన్స్ సంయుక్త ఆధ్వర్యంలో జి నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో  ఈ సినిమా తెరకెక్కనుంది. బాలనటిగా సుపరిచితురాలైన శ్రేయాశర్మ  ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. దూకుడు, జై చిరంజీవ, గాయకుడు వంటి చిత్రాల ద్వారా శ్రేయాశర్మ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఒక మంచి ప్రేమకథాచిత్రంగా ‘నిర్మలా కాన్వెంట్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే  ఈ సినిమాలో పాటలు మంచి ప్రజాదరణ పొందాయి. ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు మనుమడూ, కోటీ తనయుడూ అయిన సాలూరి రోషన్  ఈ సినిమాకి సంగీతం అందించారు. విఖ్యాత సంగీత దర్శకుడు రెహమాన్ కుమారుడు అమీన్ , శంకర్ మహదేవన్ తనయుడు సిద్దార్థ మహాదేవన్ ఈ చిత్రంలో పాడటం విశేషం.

కింగ్ నాగార్జున పాడిన ‘కొత్త కొత్త భాష ….’ ఇప్పటికీ  ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. అనంత శ్రీరామ్  ఈ చిత్రానికి పాటలు రాశారు. చిత్ర దర్శకుడు జి నాగకోటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రేమకు మించిన ప్రేరణ ఏదీ లేదనే అంశంపైన కథ ఉంటుందని పేర్కొన్నారు. రోషన్, నాగార్జున ఇద్దరూ ఉన్నారనీ, ఆ పాత్ర నాగార్జున కోసమే పుట్టిందనీ అన్నారు. అక్కినేని అభిమానులు గర్వపడేలా ఈ సినిమా ఉంటుందనే అభిప్రాయం వెలిబుచ్చారు. తన గురువు చక్రవర్తిగారి పుట్టిన రోజూ, రోషన్ మ్యూజిక్ అందించిన సినిమా ఆడియా రిలీజ్ ఒకే రోజు కావడం తన భాగ్యమని కోటి అన్నారు. హీరో రోషన్, సంగీత దర్శకుడు రోషన్ సాలూరి, ప్రముఖ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల  ఈ సినిమా ద్వారా పరిచయం కావడం మరో విశేషం.

ఇది ‘ఫ్రెష్ అండ్ ప్యూర్ లవ్ స్టోరీ’ అని హీరో రోషన్ అభివర్ణించారు. చాలా మంది కొత్తవాళ్ళను ఈ సినిమా ద్వారా పరిచయం చేయడం, తాను కూడా పాడటం చాలా సంతోషంగా ఉందని హీరో నాగార్జున అన్నారు. తాను ప్రస్తుతం ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్టు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published.