‘చిన్నాడు ఎక్కడికి పోతాడో’!

ఎలాంటి పోటీ లేనప్పుడు కూడా ఓ సినిమా రిలీజ్ కి భయపడాల్సి వస్తుందనే పరిస్థితిని ఓ వారం క్రితం ఏ సినిమా ఇండస్ట్రీ కూడా ఆలోచించి ఉండదు. ఇతర  పరిశ్రమల సంగతి పక్కన పెట్టి.. టాలీవుడ్ సంగతి వరకూ చూసినా.. ఈ వారం విడుదలకు షెడ్యూల్ చేసిన సినిమాల్లో  ఎక్కడికి పోతావు చిన్నవాడా ఒక్కటే క్రేజీ ప్రాజెక్ట్ గా కనిపిస్తోంది. మరి ఈ సినిమాకు పోటీగా మరే సినిమా అయిన విడుదలవుతుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు.

పెద్ద నోట్ల రద్దుతో అన్ని పరిశ్రమలతో పాటు సినీ పరిశ్రమపై కూడా పెద్ద దెబ్బే పడింది. ఇప్పటికే కొన్ని సినిమా షూటింగ్‌లు రద్దు కాగా, రిలీజ్ కావలసిన సినిమాల దారెటో అర్దం కాకుండా పోయింది. అల్లరి నరేష్ నటించిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం గత వారం విడుదల కావలసి ఉండగా, నోట్ల రద్దుతో నిర్మాతలు చిత్ర రిలీజ్ డేట్‌ని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. మరి కొన్ని చిత్రాలు ఇదే బాట పట్టనున్నట్టు తెలుస్తోంది.

తమిళ చిత్రాలకు అనువాదంగా వస్తోన్న బేతాళుడు, ఒక్కడొచ్చాడు చిత్రాలను ఈ వారంలో విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కాని ఇవి కూడా కొన్ని రోజుల తర్వాతే విడుదల కానున్నాయనే టాక్ వినిపిస్తోంది.  నిత్యామీనన్ నటించిన ఘటన అనే చిత్రం ఒకటి మాత్రమే నిఖిల్‌ ఎక్కడికి పోతావు చిన్నవాడా కి పోటీ ఇచ్చేందుకు రెడీ అయిందనే టాక్ మాత్రం  నడుస్తోంది. ఏదేమైనా ఇలాంటి  పరిస్థితులలో నిఖిల్‌ తీసుకున్న నిర్ణయం కాస్త భయపెట్టే విధంగానే ఉందని అభిమానుల టాక్.

సినిమా టికెట్ కి పెట్టే వందకి పెద్ద పట్టింపు ఏముందిలే అనే ఉద్దేశ్యంతో  అభిమానులు ఆలోచిస్తారనే భావనలో నిర్మాతలు ఉండగా, గతవారం రిలీజ్ అయిన నాగచైతన్య మూవీ ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం కాస్త కన్ఫ్యూజన్ లో పడేసింది.  ఒక్క రోజులో రాబట్టగల వసూళ్లను రాబట్టడానికి  ఈ చిత్రానికి దాదాపు వీకెండ్ మొత్తం పట్టింది.  అయినా   నిఖిల్ ఏ మాత్రం తగ్గకపోవడం ఆశ్చర్యకరమే.

టాలీవుడ్ ని దృష్టిలో పెట్టుకుంటే ఒకరకంగా నిఖిల్ చేస్తున్నది  కరెక్టే అయినా.. ఏదైనా తేడా వస్తే సినిమాకి వచ్చే లాస్ ని ఎవరూ భర్తీ చేయలేరన్న మాట వాస్తవం. మరి ‘చిన్నోడు ఎక్కడికి పోతాడో’ తెలియాలంటే శుక్రవారం వరకూ ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published.