కాబిల్ పై మోహన్ లాల్ కన్ను

జనతా గ్యారేజ్, మనమంతా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన నటుడు మోహన్ లాల్. మలయాళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న మోహన్ లాల్, నటుడిగా ఎన్నో అత్యున్నత గౌరవాలను అందుకున్నారు. అందుకే సూపర్ స్టార్ ఇమేజ్ కన్నా ద కంప్లీట్ యాక్టర్ అనిపించుకునేందుకు ఇష్టపడతారు మోహన్ లాల్. ప్రస్తుతం నటుడిగా వరుస సూపర్ హిట్ లు సాధిస్తున్న ఈ స్టార్ హీరో బిజినెస్ మీద కూడా దృష్టి పెడుతున్నాడు.

మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ నటుడిగానే కాక గాయకుడిగా, నిర్మాతగా, సినిమా డిస్ట్రిబ్యూటర్ గా సుపరిచితుడే. అయితే, ఇన్నాళ్లు మలయాళ సినిమాలను మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేసిన మోహన్ లాల్ ప్రస్తుతం పరభాషా సినిమాల మీద దృష్టి పెట్టాడు. తాను విజయ్ తో కలిసి చేసిన జిల్లా సినిమాతో తొలిసారిగా పరభాషా సినిమాను కేరళలో రిలీజ్ చేసిన మోహన్ లాల్ కంపెనీ ఇప్పుడు వరుసగా ఇతర భాషల సినిమాల మీదే దృష్టి పెడుతోంది.

ఇటీవల జనతా గ్యారేజ్ సినిమాను భారీగా రిలీజ్ చేసిన మోహన్ లాల్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన కాబిల్ కేరళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడు.  కాబిల్‌ చిత్రంలో హృతిక్ అంధుడిగా కనిపించనుండగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఈ హీరో కాబిల్‌ మూవీ ని కేరళలో డబ్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది

మోహన్ లాల్‌ నటుడిగా సక్సెస్ సాధిస్తూనే డిస్ట్రిబ్యూటర్ గాను తన సత్తా నిరూపించుకుంటున్నాడు.  భారీ బడ్జెట్ తో శంకర్, రజనీకాంత్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న రోబో సీక్వల్ రైట్స్ కోసం కూడా ఈ మలయాళ స్టార్ భారీ ప్రయత్నాలు ప్రారంభించాడట. నటుడిగా టాప్ పొజీషన్ లో ఉన్న మోహన్ లాల్ నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గానూ అదే ఫాం చూపించాలని భావిస్తున్నాడు. మరి ఈ రంగాలు కంప్లీట్‌ యాక్టర్‌ ని ఏ రేంజ్ కి తీసుకెళతాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.