మ్యూజిక్ లో మ్యా’జిక్కి’

గానం తమ ప్రాణంగా భావించి చిరస్మరణీయమైన గానామృతధారలు అందించిన వారు మన తెలుగు చిత్రసీమలో ఎందరో ఉన్నారు. అజరామరమైన ఆ పాటలు తరాలు గడిచినా ఆపాత మధురాలు. రసరాగ రంజితాలు. తరాలు గడిచినా, ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు వచ్చినా ఆ గాన రసవాహినిలో ఈనాటికీ తేలియాడని రసజ్ఞులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి గానధుని జిక్కి. నవంబర్ 3 ఆమె జయంతి. ఆ సందర్భంగా ఆ మధుర గాయినికి నివాళులర్పిద్దాం.

గాయనీగాయకుల్లో రసప్లావితంగా, కోయిల కూజితంగా, స్వరమధురిమలు కర్ణపేయంగా అందించే గానధురీణులు మనకున్నారు. నటీనటులు నటనతో పాత్రలకు జీవం పోస్తే, గానరస ధారతో  కమనీయంగా, శ్రవణపేయంగా అలరించిన వారూ ఉన్నారు. అలాంటి అసమాన ప్రతిభా విదుషీమణి గాయని జిక్కి. ప్రేక్షకులు ఆమె గానస్రవంతిలో చిక్కి, తన్మయులయ్యారు.

1935 నవంబర్ 3న సంగీత కుటుంబంలో స్వరాల వల్లరిని ఊయలగా చేసుకొని పుట్టిన జిక్కి పూర్తిపేరు పిల్లవలు గజపతి కృష్ణవేణి. ఆమె సోదరి పి లీల. సంగీతానికి స్వరాభిషేకం చేసిన జిక్కి బాలనటిగా రెండు మూడు సినిమాల్లో చేసింది. 1948లో  తమిళంలో జ్ఞాన సుందరి చిత్రంతో జిక్కి సినిమాల్లోకి అడుగిడింది.  తెలుగులో మనదేశం 1949 ఆమె ప్రథమ చిత్రం. చిత్రమేమిటంటే  విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు మొదటి సినిమాలో జిక్కి గానం చేసింది.

అన్ని పాటలూ ఒకే స్వరంతో కొందరు పాడతారు. కానీ జిక్కి గాత్రంలో తారస్థాయి, మధ్యమం, మంద్రస్వరం కూడా పలికాయి. వలపు పాటలతో పాటు చిలిపి పాటలు, విషాద గీతాలు కూడా ఆమె గొంతులో మృదులంగా, మధురంగా పలికాయి. శ్రీరామనవమి పందిళ్లలో ఏటా వినిపించే .. .. శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండీ పాట ఆమె ఆలపించిందే. ఇక రోజులు మారాయి చిత్రంలో .. .. ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా పాటను పల్లెటూరి వారు కూడా మరచిపోరు.

అనార్కలి లో రాజశేఖరా నీపై మోజు తీరలేదురా అని పిలిచినా, అర్ధాంగిలో వద్దురా కన్నయ్యా అని గారాలు పోయినా, ఓహో బస్తీ దొరసానీ బాగా ముస్తాబయ్యింది అని హొయలు పోయినా, శాంతి నివాసంలో కం కం కం కంగారు నీకేలనే అని అల్లరి చేసినా, జిక్కికే చెల్లింది. ఏళ్లు గడిచినా  మరణించేవరకూ జిక్కి గాత్ర మాధుర్యం ఏమాత్రం తగ్గలేదు.

జిక్కి స్వరంలో మ్యూజిక్కే కాదు మ్యాజిక్  కూడా ఉంది. కొందరు ఆమెను మ్యూ.. . జిక్కి అని, మ్యా జిక్కి అని కూడా అంటారు. జిక్కి పాడలేని పాట లేదు. విని తన్మయుడు కాని శ్రోతా లేడు. తెలుగు సినిమాకు సుస్వర మాధుర్యం జిక్కి. ఆమె జయంతికి మా నీరాజనం.

Leave a Reply

Your email address will not be published.