భారీగా విడుదల కానున్న కాష్మోరా

ఈ మధ్యకాలంలో సినిమా బాగున్నా – లేక భారీ బడ్జెట్ కేటాయించుకున్నా… ఆ సినిమాని వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించుకుంటున్నారు నిర్మాతలు. ఈ విషయంలో ఇప్పటికే బాహుబలి చేయాల్సిందంతా చేసింది. ఈ క్రమంలో కార్తీ కాష్మోరాను కూడా ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారట. మిగిలిన చోట్ల సంగతేమోకానీ… టాలీవుడ్‌ లో కాష్మోరా భారీఎత్తున విడుదల కానుందట మరి.

హీరోగా తమిళనాట పరిచయం అయినా.. తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో కార్తీ. తమిళ్ తోపాటు తెలుగులో కూడా ఘన విజయాలు సాధించిన కార్తీ ప్రస్తుతం తన ప్రతి సినిమాను తమిళ్ తోపాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేస్తున్నాడు. అదే బాటలో తన తాజా చిత్రం కాష్మోరాను కూడా ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

దీపావళికి తెలుగు సినిమాల రూపంలో పెద్దగా సందడిలేదు. మంచు లక్ష్మి సినిమా “లక్ష్మీబాంబు” మినహా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం ఈ దీపావళికి నిరాశే. ఈ క్రమంలో దీపావళి పండగను అత్యంత ప్రత్యేకంగా భావించే తమిళ జనాలు మాత్రం రెండు భారీ సినిమాలతో రెడీ అయిపోయారు. అందులోఒకటి కార్తి నటించిన కాష్మోరా అయితే.. ఇంకోటి ధర్మయోగి. వీటిలో కార్తీ సినిమాపై తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

కాష్మోరా చిత్రం తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అవుతుంది.తమిళనాట ధనుష్ సినిమా “కోడి” నుంచి తీవ్ర పోటీ ఉండటంతో తమిళనాడు మొత్తంలో ఈ చిత్రానికి 450 స్క్రీన్లే దక్కాయి. కానీ తెలుగులో మాత్రం ఏకంగా 600 స్క్రీన్లలో ఈ సినిమా విడుదలను ప్లాన్ చేస్తున్నారు. 60 కోట్ల బడ్జెట్ తో  ఈ చిత్రం రూపొందగా, తెలుగువారికి బాగా దగ్గరైన పీవీపీ సంస్థ ఈ సినిమాని నిర్మించడంతో… తెలుగులో కూడా భారీగా విడుదల చేయాలని నిర్ణయాని కొచ్చారట.

Leave a Reply

Your email address will not be published.