అయోమయంలో ఎన్టీఆర్

ఒకప్పుడు కంప్లీట్ మాస్ సినిమాలకు మొగ్గుచూపిన ఎన్టీఆర్ ఈ మధ్య నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి విభిన్న కథలను ఎంచుకుని సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రాలు ఎన్టీఆర్ ఇమేజ్ ని మరింత పెంచాయి. ఈ రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ పాత ఫార్ములాలోకి వెళతాడా, ఈ కొత్త ఫార్ములానే కొనసాగుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చలు కూడా మొదలయ్యాయి.

నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి సక్సెస్ ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్  చేయబోయే సినిమా గురించి అందరికి ఆసక్తి కలుగుతుంది. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లతో ఎన్టీఆర్ తన రేంజ్ ని పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పటికే 75 కోట్లు దాటిన జనతా గ్యారేజ్ వసూళ్లు 80 కోట్ల మార్కును టచ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. తను చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా ఈ రేంజ్ ని మరింత పెంచేదిగా ఉండాలన్నది జూనియర్ ఆలోచనగా తెలుస్తోంది.

ప్రస్తుతం యంగ్ టైగర్ ముగ్గురు డైరెక్టర్లను హోల్డ్ లో పెట్టాడు. ఎన్టీఆర్ కి పూరీ జగన్నాథ్ గతంలోనే ఓ స్టోరీ చెప్పగా, ఇప్పుడా ప్రాజెక్టుకు ఎన్టీఆర్ కొంత మొగ్గుచూపుతున్నాడు. అయితే పటాస్, సుప్రీమ్ లతో సూపర్ హిట్స్ కొట్టిన అనిల్ రావిపూడి చెప్పిన స్టోరీ కూడా ఎన్టీఆర్ కి బాగా నచ్చిందని అంటున్నారు. మరోవైపు లింగు స్వామి ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ ని ఎన్టీఆర్ కి వినిపించాడు. పూరీ-అనిల్ రావిపూడిలలో ఒకరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఎన్టీఆర్ ఆలోచిస్తుంటే, సన్నిహితుల సలహా వేరే రకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సన్నిహితుల సలహా ప్రకారం  జనతా గ్యారేజ్ తో కేరళలో మార్కెట్ సాధించిన జూనియర్ లింగుస్వామితో సినిమా చేస్తే కోలీవుడ్ లో పాగా వేయచ్చని చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే ఎన్టీఆర్ ఆలోచనలో పడ్డాడని అంటున్నారు.మరోవైపు మాస్ డైరెక్టర్ బోయపాటి కూడా ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్‌ రెడీ చేసాడట. అయితే ఈ ప్రాజెక్టుల్లో ఎన్టీఆర్ ఏదైనా ఓకే చేసేయవచ్చని దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ మాత్రం ఈ వారంలోనే చేయబోతున్నాడని టాక్.

Leave a Reply

Your email address will not be published.