ప్రధాని లాహోర్ ఎందుకు వెళ్లారు?

  • కరణ్ జోహార్ కు మద్దతుగా ప్రశ్నించిన అనురాగ్ కాశ్యప్
  • సినిమాపై నిషేధం తగదన్న ప్రియాంక, అలియా భట్
  • భారత్-పాక్ వాణిజ్యాన్ని ఎందుకు నిషేధించలేదని మరికొందరి ప్రశ్న

ముంబై: పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన కారణంగా కరణ్ జోహార్ ఫిల్మ్ ఏ దిల్ హై ముష్కిల్ ను తమ థియేటర్లలో ప్రదర్శించరాదని థియేటర్ల యజమానులు తీసుకున్న నిర్ణయంపై అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ కూడా స్పందనలు వస్తున్నాయి. తాజాగా  అనురాగ్ కాశ్యప్, ప్రియాంకా చోప్రా, అలియా భట్ తదితరులు స్పందించారు. అనురాగ్ కాశ్యప్ ఒక ట్వీట్ లో కరణ్ జోహార్ కు మద్దతు తెలుపుతూ థియేటర్ యాజమానుల సంఘాన్ని విమర్శించాడు. “ప్రపంచం మా దగ్గర నేర్చుకోవాలి. మూవీలను నిందించడం ద్వారా, వాటిని నిషేధించడం ద్వారా మా సమస్యల్ని పరిష్కరించుకుంటాం” అంటూ వ్యంగ్యబాణాలు విసిరాడు.

గత సంవత్సరం ప్రధాని నరేంద్ర మోడీ మరి లాహోర్ ఎందుకు వెళ్ళినట్టు అని కూడా ప్రశ్నించాడు. ప్రధాని లాహోర్ లో పాకిస్తాన్ ప్రధాని ఆతిథ్యం అందుకుంటున్నప్పుడే కరణ్ జోహార్ ఈ సినిమా ప్రారంభించిన సంగతిని గుర్తు చేశాడు. దీనిపై బీజేపీ అధికారప్రతినిధి నళిన్ కోహ్లీ వెంటనే సమాధానమిస్తూ, ఇది రాజకీయ వ్యాఖ్య అనీ, విదేశాంగ విధానాన్ని ఒక సినిమాతో జమకట్టడం విచారకరమనీ అన్నారు.

అలియా భట్ స్పందిస్తూ, ఆ సినిమా అక్కడక్కడ చూశాననీ చాలా బాగుందనీ, ఆ సినిమా విడుదలను ఆపడం అన్యాయమనీ వ్యాఖ్యానించింది. ఏడాది క్రితం ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పుడు దేశంలో వాతావరణం ఇలా లేదన్న సంగతిని గమనించాలంది. తమను తామే దేశభక్తులుగా ప్రకటించుకునేవారు సినిమాలను నిషేధించేబదులు సైనికుల బాగోగులకు నిజంగా తాము ఏం చేస్తున్నారో ప్రశ్నించుకోవాలంది.

ఒక సైనికాధికారి కుమార్తె అయిన ప్రియాంకా చోప్రా స్పందిస్తూ, తన దేశభక్తిని ఎవరూ శంకించలేరనీ,  పాకిస్తాన్ కళాకారులను నిషేధించడం కన్నా సైనికులు, వారి కుటుంబాల భద్రతను పట్టించుకోవడం ముఖ్యమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం మంచిదనుకుని భావించి ఏం చేసినా దానిని అనుసరిస్తానని అంటూనే కేవలం సినీ కళాకారులకు మాత్రమే ఇలాంటి విషయాల్లో ఎందుకు గురి పెడుతున్నారని ప్రశ్నించింది.

బాలీవుడ్ కు చెందిన అజయ్ దేవ్ గణ్, అనుపమ్ ఖేర్, అశోక్ పండిట్ తదితరులు భిన్నవైఖరి ప్రకటించిన సంగతి తెలిసినదే. అదలా ఉండగా, కరణ్ జోహర్ సినిమా విడుదల కావలసిన అక్టోబర్ 28నే అజయ్ దేవ్ గణ్ నటించిన సినిమా కూడా విడుదల అవుతోంది కనుక దానికి పోటీ ఉండకూడదనే ఉద్దేశంతోనే థియేటర్ల యాజమానుల సంఘం కరణ్ జోహార్ సినిమాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందన్న ఊహాగానాలూ బాలీవుడ్ లో ఊపందుకున్నాయి.

శనివారం జరిగిన ఒక టీవీ చర్చలో, వేల కోట్ల విలువైన భారత్-పాక్ వాణిజ్య సంబంధాలను ఎందుకు నిషేధించలేదు, సినిమాల మీదా, నటుల మీదే ఎందుకు నిషేధం విధిస్తున్నారన్న ప్రశ్న కొందరు లేవనెత్తారు.

Leave a Reply

Your email address will not be published.