పవన్ ప్లాన్ ఏమిటి?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తను స్థాపించిన జనసేన పార్టీని బలోపేతం చేయడానికి సంసిద్దమయ్యాడు. ఒక వైపు సినిమా ఓపెనింగ్ లతో బిజీగా వుంటూనే ఇంకో వైపు పార్టీ కార్యకలాపాలలో తలమునకలవుతున్నాడు. ఏకకాలంలో అటు రాజకీయాలను ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ తన చాకచక్యాన్ని ప్రదర్శిస్తున్నాడు.

పవన్ కళ్యాన్ రీసెంట్ గా తన ఓటు ను హైదరాబాద్ జాబితా నుండి తొలగించి, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరుకు మార్చుకుని, అక్కడే స్థిర నివాసం ఏర్పచుకుంటూ ఉండడంతో పవన్ అభిమానుల్లో ఆందోళన మొదలయింది.త్వరలో పవన్ కళ్యాన్ సినిమాలను వదిలేస్తాడనే మాటలకు ఊతం అందించినట్టుగా అయింది. ఇక ఆంధ్ర ప్రాంతానికి పవన్ పరిమితమైతే తెలంగాణా వ్యాప్తంగా విస్తరించి వున్న ఆయన అభిమానులు ఏంకావాలని అంతా అనుకుంటున్నారు.

పవన్ కళ్యాన్ ఆంధ్రప్రాంత వాసులకు అందుబాటులో వుంటానని చెబుతూనే తెలంగాణాలోనూ తన పార్టీని బలోపేతం చేయడానికి సంబంధిచిన చర్యలు మొదలు పెట్టాడు. ఇందులో భాగంగా జనసేన పార్టీ తెలంగాణ ఇన్‌చార్జిగా నేమూరి శంకర్ గౌడ్‌ని  నియమించాడు. హైదరాబాద్ బోరబండ నివాసి అయిన శంకర్ గౌడ్ గతంలో పవన్ ఏర్పాటు చేసిన కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో చురుకైన సభ్యుడు.

జనసేన పార్టీ తెలంగాణలో పార్టీ రాజకీయ కార్యక్రమాల సమన్వయకర్తగా బొంగునూరి మహేందర్ రెడ్డికి పవన్ బాధ్యతలు అప్పగించాడు. ఈయనకూడా తనతో రాజకీయ, సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడని పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు. సీనియర్ జర్నలిస్ట్ పి.హరిప్రసాద్ మీడియా ఇంచార్జ్ అయ్యారు. వీరి సహకారంతో తెలంగాణాలో జనసేన ఇక సంస్థాగతంగా బలపడుతుందని పవన్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

పవన్ కళ్యాన్ పార్టీపరంగా చూపిస్తున్న దూకుడు చూస్తుంటే ఇక ఆయన సినిమాలకు దూరమవడానికి ఎంతకాలం పట్టదని ఆందోళన చెందుతున్నారు అభిమానులు.అందుకే వెంటవెంటనే సినిమాలు మొదలుపెడుతూ హడావవుడిగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. మరి పవన్ తన తదుపరి అడుగు ఏంటో ఇప్పటివరకు ఎవరికి తెలియజేయలేదు. ఎప్పటిలాగే సినిమాలు చేస్తూ రాజకీయల్లో వుంటాడా?లేదంటే సినిమాలు వదిలేసి పూర్తి రాజకీయాలకు పరిమితమవుతాడా చూడాలి.

Leave a Reply

Your email address will not be published.