తరాలు గడిచినా తరగని స్వరమాధుర్యం

ఆమె పాటకు పుడమి పులకిస్తుంది. మేఘం వర్షిస్తుంది. సెలయేటి జాలు ఆగిపోతుంది. పచ్చనిపైరు తల ఊపుతుంది. గాలికి సైగ చేసి చెబుతుంది. ప్రకృతిని, ప్రపంచాన్ని తన గానధారతో తన్మయం చేసి ఆ కోకిల లతామంగేష్కర్. 65 ఏళ్లుగా ఏ కాలంలోనైనా మన మనసులకు వసంతాన్నిస్తోంది ఆ గాన కోకిల. ఎన్నేళ్లు గడిచినా ఆ కంఠం చెక్కు చెదరలేదు. ఆ గాన మాధుర్యం తగ్గలేదు.

హిందీ పాట అనగానే ఎవరికైనా మొదట గుర్తుకొచ్చేది లతామంగేష్కర్. భారతీయులపై ఆమె గానామృతాన్ని ఒలికించింది కాబట్టే…అంతగా గుర్తుండిపోయింది లత. ఆయేగా…ఆయేగా అంటూ తొలినాళ్లలో  లత ఆలపించిన ఆ పాటకు యావద్దేశమే కదలివచ్చింది.  తరతరాల ప్రేక్షకులు, శ్రోతలు పులకించారు.  లత పాట ఓ అమృతం. అందుకే ఆ పాటకు వయసులేదు.

65 ఏళ్లకుకు పైగా లతామంగేష్కర్ గొంతు నుంచి పాట జాలువారుతోంది.  ఓ వయసు వచ్చాక ఎవరి గొంతులో అయినా వార్థక్య లక్షణాలు వస్తాయి. కానీ…లత ఇప్పుడు పాడినా ఓ టీనేజ్  అమ్మాయి పాడినట్టే  ఉంటుంది. ఆ స్వరం  దేవుడిచ్చిన  గొప్ప వరం. లత పలికించని భావం లేదు. ఒలికించని రాగం లేదు. లాలిత్యం తొణికిసలాడే ఆ స్వరంలో వలపు మకరందం కురుస్తుంది. అల్లరిపాట పాడితే చిలిపితనం మురుస్తుంది.

మధురమైన ప్రేమగీతమైనా, మనసు కదిలించే విషాదగీతమైనా, ఆర్తితో పాడే భక్తి గానమైనా లత గొంతులో ప్రాణం పోసుకుంటుంది, జీవం నింపుకొంటుంది. ఈ గానకోకిల పాట ఒక్కటైనా వినని భారతీయుడు లేడంటే అతిశయోక్తి కాదు. లత పాటను ఇంట్లో కూనిరాగం తీయనివారుండరు. హీరోయిన్స్  అభినయానికి ఆమె పాట మరింత వన్నె తెచ్చింది. సంగీత దర్శకులు కూడా ఆమె పాటలతో  పైకొచ్చారు.

ఇప్పటికి కొన్ని వేల పాటలు పాడారు లత. ఆమె ఎక్కువగా ప్రేమగీతాలే గానం చేశారు. మనసుకు హాయినిచ్చే పాటలూ ఆలపించారు. హిందీలోనే కాక, పలు భాషల్లోనూ లత గీతాలాపన చేశారు. 30 వేలకు పైగా పాటలు పాడి గిన్నెస్ బుక్ లో స్థానం సంపాదించారు. తెలుగులో సంతానం చిత్రంలో …నిదురపోరా తమ్ముడా …అనే పాటను లత పాడారు. ఏ భాషలో పాడినా ఆమె మాతృభాష అదేనా అనిపించేలా పాడిన లతా మంగేష్కర్ భారతదేశం గర్వించదగ్గ గాయని.

Leave a Reply

Your email address will not be published.