ఘంటసాల లేని తెలుగు పాటను ఊహించలేం

శ్రీకృష్ణుడు భగవద్గీతలో .. నేనే సత్యం.. .. నేనే నిత్యం అంటాడు. తెలుగు పాటశాలకు ఘంటసాల నిత్యం, సత్యం. ఆయన తెలుగు పాటకు ఓ భగవద్గీత. ఘంటసాల లేని తెలుగు పాటను ఊహించలేం. తెలుగు పాటల స్వరానికి వరం ఆయన. ఘంటసాల పరమపదించి నాలుగు దశాబ్దాలకు పైగా గడిచినా ఇప్పటికీ ఆయన గాన ధార ప్రతివారినీ పులకింపచేస్తోంది. పరవశింప చేస్తోంది. ఘంటసాల జయంతి సందర్భంగా ఆయనకు స్వర నివాళిగా ఈ ప్రత్యేక కథనాన్ని సమర్పిస్తున్నాం.

తెలిమంచు తెరలు విడుతున్న వేళ …ముసిరిన చీకట్లు తొలగుతూ … వెలుగు రేఖలు విచ్చుకుంటున్న ప్రభాత సమయం. గాలి అలలు అలలుగా మంద్రంగా వీస్తూ ఘంటసాల గానామృతంలో తలమానికమైన భగవద్గీతను కర్ణపేయంగా వీనులకు అందిస్తోంది. ప్రతి తెలుగు వారి హృదయాన్ని మృదువుగా తాకే ఆ దృశ్యం .. .. ఆ గానం.. .. సుమకోమల స్వర రంజితం. ఆయన రాగధార ఒక స్వరామృతం.

ఘంటసాల మన తెలుగువాడు కావడం మనం చేసుకున్న సుకృతం. ఘంటసాల చిరస్మరణీయుడే కాదు .. .. స్వర స్మరణీయుడు కూడా.  ఆయనలా పాడే గాయకుడు న భూతో న భవిష్యతి అనవచ్చు. పాటలు పాడాలనుకుంటున్న  ప్రతి యువగాయకుడూ ఘంటసాలలా  పాడాలను కుంటాడు. అంటే ఘంటసాల ప్రభావం ఎంతటి మహత్తరమైందో, ఎంతటి బృహత్తరమైందో  అర్థమవుతూనే ఉంది.

రాగశాల ఘంటసాల పద్యాన్ని ఆలపించినా, పాట పాడినా  అది సంగీత సరస్వతికి హృద్యమైన నైవేద్యం. కృష్ణా జిల్లా చౌటపల్లి లో 1922 డిసెంబర్ 4న పుట్టిన ఘంటసాల వెంకటేశ్వరరావు .. .. వెంకటేశ్వరరావు .. జీవితపు తొలి సంధ్యలో ఎన్నో కష్టాలు పడ్డారు. అయినా అకుంఠిత దీక్షతో సంగీత సాధన చేసి .. ..అజరామరమైన పాటల్ని అందించారు.

ఘంటసాల పాడిన కొన్ని వేల పాటల్లో ఏది మంచిది అనే ప్రశ్నే లేదు. అన్నీ సుమధుర రాగ తరంగాలే. ఆ రోజుల్లో  ఆయన గళమివ్వమని కథానాయకుడు లేడు. కంచుకంఠంతో ఘంటసాల  ఏ హీరోకి పాడినా అది ఆ హీరో సొంతంగా పాడినట్టే ఉండేది. హీరోలకే కాదు.. .. కమేడియన్స్ కి, కేరక్టర్ ఆర్టిస్టులకూ కూడా  ఆయన గాత్రదానం చేశారు.

కవి రాసిన పాటలో భావం చెడకుండా, ఆ సాహిత్యానికి, భావానికి మరింత వన్నెచిన్నెలద్ది పాడడం ఘంటసాలకే చెల్లింది. ఎటువంటి పాటైనా  ఆయన అవలీలగా పాడేవారు. సోలో సాంగ్స్, యుగళగీతాల, పద్యాలు, శ్లోకాలు, బృందగీతాలు, ప్రైవేట్ సాంగ్స్ .. .. ఇలా కొన్ని వేలు పాడారు అమర గాయకుడు ఘంటసాల. భక్తి, ప్రేమ, కరుణ, హాస్యం .. .. ఇలా ఏ భావమైనా ఆయన గొంతులో జీవం పోసుకునేది.

ఘంటసాల పాడిన అన్ని పాటలూ ఒక ఎత్తైతే .. .. జీవితపు చరమాంకంలో

అజరామరం అనదగ్గట్టు  ఆలపించిన భగవద్గీత .. .. ఆయన మనకు శాశ్వతంగా  అందించిన  ఒక ఐతిహ్యం. మనిషి జీవితం బుద్బుత ప్రాయమని, చివరకు మిగిలేది పిడికెడు మట్టే అని జీవన తత్వాన్ని చెప్పిన భగవద్గీతకు  స్వరభాష్యం చెప్పారు ఘంటసాల. ఆ మహాగాయకుడు మనమధ్య లేకపోయినా .. .. ఆయన పాట చిరంజీవి. అమరగాయకుడు ఘంటసాలకు టాలీవుడ్ నివాళి.

Leave a Reply

Your email address will not be published.