కమల్ హాసన్, గౌతమి విడిపోయారు

  • స్వయంగా ప్రకటించిన గౌతమి

విడిపోయిన సెలెబ్రెటీలలో మరో జంట చేరింది. వారు ప్రముఖ సినీ హీరో కమల్ హాసన్, నటి గౌతమి. 13 ఏళ్ల సహజీవనం తర్వాత తామిద్దరూ ఇక కలసి ఉండబోవడం లేదని గౌతమి ప్రకటించింది. ఇది నిజంగా ఎవరూ ఊహించని షాకే. వాళ్ళ మధ్య కలతలు ఉన్నట్టు ఎలాంటి వార్తా లేదు. కొంత విరామం తర్వాత గత సంవత్సరం గౌతమి, కమల్ సినిమా ‘పాపనాశం’ లో కూడా నటించింది.

ఇన్నేళ్ల బంధాన్ని తెంచుకోవడం తన వరకు గుండెల్ని పిండేసే అనుభవమే నని గౌతమి అంటూనే, రెండేళ్లుగా మా మధ్య కలతలు ఏర్పడినట్టు సూచనప్రాయంగా చెప్పింది. ఒకరినొకరు ఇష్టపడి కలసి ఉంటున్న జంట, తమ మార్గాలు ఎప్పటికీ కలవలేవు అన్నంతగా వేరై పోయాయనీ,  జీవితం తాలూకు కలలతో రాజీపడి కలసి ఉండిపోవడమో లేక వాస్తవాన్ని ఒప్పుకుని విడిపోయి ఎవరి దారిలో వారు ముందడుగు వేయడమో మినహా తమకు మరో మార్గం లేదని గ్రహించి ఇలాంటి  నిర్ణయానికి రావడం అంత తేలిక కాదని తన బ్లాగ్ లో రాసింది.

కమల్ తో తను విడిపోవడానికి కారణం కూతురు పట్ల తన బాధ్యతే నని కూడా గౌతమి సూచించింది. 1999 లో భర్తకు విడాకులిచ్చిన తను 2005 నుంచి కమల్ తో సహజీవనం చేస్తోంది. తన 35 వ ఏట బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన గౌతమి కమల్ అండతో, తన ఇతర స్నేహితుల సాయంతో ఆ కష్టాన్ని తట్టుకుని చివరికి క్యాన్సర్ ను జయించింది.

నేనున్న ఇప్పటి జీవితదశలో విడిపోయి తన జీవితం తాను జీవిస్తానని నిర్ణయించుకోవడం ఏ స్త్రీకైనా కష్టసాధ్యమే ననీ, అయితే నాకు ఇది అనివార్యమైందనీ రాసింది. కారణం, తను ఒక బిడ్డకు తల్లిననీ, బిడ్డ పట్ల తల్లిగా బాధ్యత నెరవేర్చుతూ ఒక ఉత్తమ మాతృమూర్తిని కావలసిన అవసరం తనకు ఉందనీ అంది.

తను సినీ పరిశ్రమలోకి రాకముందునుంచీ కమల్ కు అభిమానినే ననీ, ఇప్పటికీ ఆయన అసాధారణ ప్రతిభను ఆరాధిస్తూ, ఆయన విజయాలను అభినందిస్తూనే ఉంటానని చెప్పింది. ఆయనకు సవాళ్ళు ఎదురైన ప్రతి సందర్భంలోనూ వెన్నంటి ఉన్నాననీ, అవి నా జీవితంలో అమూల్యమైన క్షణాలనీ అభివర్ణించింది. ఆయన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తూ ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని కూడా రాసింది. తన నట జీవితంలో ఆయన ఇంకా ఎన్నో సాధించాలని ఆకాంక్షించింది.

Leave a Reply

Your email address will not be published.