మారుతున్నపబ్లిసిటీ ట్రెండ్స్

ఎంత కష్టపడి సినిమా తీసినా జనం చూస్తేనే నాలుగు డబ్బులొస్తాయి. చూడాలంటే  వాళ్లకు సినిమా గురించి తెలియాలి. వాళ్లను థియేటర్ కు రప్పించాలి. వాళ్లు సినిమా చూసేలా చేయాలి. అందుకు పబ్లిసిటీ అనేది లైఫ్. సినిమా సక్సెస్ కోసమే కాదు, అందులో  యాక్ట్  చేసిన నటీనటులకు కూడా ప్రచారం కావాలి. ఈమధ్య కొంతకాలం నుంచీ సినిమా పబ్లిసిటీలో వెరైటీ ట్రెండ్స్ వస్తున్నాయి.

సినిమా పబ్లిసిటీకి ఇదివరకు పత్రికల్లో , టీవీల్లో యాడ్స్ ఇవ్వడం, పోస్టర్లు, ఫ్లెక్సీలు వేయడం, థియేటర్స్ లో రాబోయే మూవీ అంటూ స్లైడ్స్ వేయడం వంటివి చేసేవారు. రిలీజ్ కు ముందే ఈ తరహా ప్రచారం జరిగేది. కానీ ఇప్పుడు పబ్లిసిటీ ట్రెండ్ మారిపోయింది. పిక్చర్ స్టార్ట్ కాకముందు నుంచే పబ్లిసిటీ మొదలవుతోంది. షూటింగ్ స్టార్ట్ కాకుండానే పేరుపై క్యూరియాసిటీ కలిగిస్తున్నారు.  పేరు సూచించమని, గిఫ్ట్ ఇస్తామని కాంపిటీషన్ పెడుతున్నారు.

ఇంకో పబ్లిసిటీ ట్రిక్ ఏంటంటే… ఒకసారి పెట్టిన పేరును మార్చడం. అలా మార్చి …మంచి టైటిల్ పెట్టామని చెప్పడం. ఒక్కోసారి ఆ టైటిల్ పై వివాదం రేగితే కూడా మారుస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కావాలని వివాదం రేగేలా కూడా చేస్తున్నారు.  టైటిల్ పై వివాదాలే కాకుండా…చాలసార్లు కథపై వివాదాలు  కూడా వచ్చాయి. వివాదం రాగానే పేరు మార్చేస్తున్నారు.

భక్తి సినిమాల రిలీజ్ టైంలో థియేటర్లో  దేవుడి విగ్రహాన్ని పెట్టడం, హుండీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక లేటెస్ట్ గా డైరెక్టర్ తేజ మూవీ పబ్లిసిటీ వింతగా జరుగుతోంది. ఆ సినిమా  హీరో రానా ఓ పిక్‌ని తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. గాజులతోవున్న ఓ అమ్మాయి చెయ్యి, బ్రాస్‌లెట్‌‌తో ఓ అబ్బాయి చెయ్యి ఉన్న పిక్ ఆసక్తికరంగా మారింది. ఆ చేతులు రానా, కాజల్‌ వి. వీరిద్దరు కలిసి తేజ డైరెక్షన్‌ లో మూవీ చేస్తున్నారు.

హీరోలు కూడా తమ సినిమాను ఎప్పటికీ స్టార్ట్ చేయకుండా ఆలస్యం చేస్తూ ఫ్యాన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే హీరోయిన్ ఎవరనేది కూడా ఎంతకీ డిసైడ్ చేయరు. ఒక్కోసారి మనకు తెలీని పరాయి భాషా నటీమణుల్ని కూడా  మూవీలో తీసుకుంటారు. కొందరు పదే పదే డైరెక్టర్లను మార్చడం కూడా సినిమా పబ్లిసిటీలో భాగమే. అలాగే రిలీజ్ డేట్ ను మార్చడం కూడా పబ్లిసిటీలో ఒక పార్టే. ఇంకో తమాషా ఏంటంటే…తమ సినిమా పిక్స్ ను, సీన్స్ ను మేకర్స్ తామే లీక్ చేసి పబ్లిసిటీ కొట్టేస్తుంటారు.

ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్ కు ఆడియో ఫంక్షన్స్, టీజర్, ఫస్ట్ లుక్ , ట్రైలర్ రిలీజ్ లు వంటివి చేస్తున్నారు. భారీ బడ్జెట్లు, ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి గొప్పగా చెప్పుకోవడం, కోట్ల రూపాయలతో  సెట్ వేశామని ప్రకటించడం వంటివి కూడా పబ్లిసిటీలో ఒక పార్టే. ప్రమోషన్ కు హీరోయిన్ రాకపోవడం కూడా పబ్లిసిటీనే. నిజం చెప్పాలంటే… మూవీ ప్రచారానికి కాదేదీ అనర్హం.

Leave a Reply

Your email address will not be published.