మంచి సినిమాకు మరోపేరు బీ ఎన్

తెలుగు చలనచిత్ర రంగంలో మకుటాయమానంగా భాసించిన దిగ్దంతులు ఆ రోజుల్లో ఎందరో ఉన్నారు. తాము తీసిన సినిమాల్లో విలువలకు పట్టం కట్టిన, ఉన్నత విలువలు కలిగిన దిగ్ దర్శకులు వారు. వారిలో బిఎన్ రెడ్డి ఒకరు. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళిగా  అందిస్తూ… 

తెలుగు చిత్ర పరిశ్రమ పాదాభివందనం చేయదగ్గ మహితాత్ముడు, మహనీయమూర్తి  బిఎన్ రెడ్డి, ఆయన సినిమాలు చూస్తే మనసున మల్లెల మాలలూగుతాయి.  హృదయం   పరవశించిపోతుంది. తెలుగు సినిమాకు వన్నెను, విలువను  తెచ్చిన  బిఎన్ రెడ్డి పూర్తి పేరు .. .. బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి.  కానీ బిఎన్ రెడ్డి అంటేనే అందరికీ తెలుసు. ఆయన అభిరుచి కల నిర్మాత మాత్రమే కాదు .. .. అభినివేశం ఉన్న దర్శకుడు కూడా.

దర్శకుడిగా బిఎన్ రెడ్డి తీసిన మల్లీశ్వరి తెలుగు సినిమాల్లో ఒక మేలిమి ముత్యం. బిఎన్ ఎంతటి భావుకుడో చెప్పడానికి ఆ ఒక్క సినిమా చాలు. అసలాయన పేరు చెబితే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఆ సినిమానే. బిఎన్ రెడ్డిలో భావుకత మాత్రమే కాదు .. .. ఒక అభ్యుదయ వాది, ఒక సంఘ సంస్కర్త కూడా ఉన్నాడు. సమాజాన్ని మార్చాలనే తపన .. . ఆయన తీసిన వందేమాతరం, సుమంగళి, దేవత వంటి సినిమాల్లో కనిపిస్తుంది.

సామాజికంగానే కాదు …  కుటుంబ పరంగా కూడా సందేశాన్నిచ్చిన  చిత్రం .. . బిఎన్ తీసిన రంగుల రాట్నం. అన్నదమ్ములు  కొట్లాడుకుంటే .. .. వాళ్లను కన్న తల్లి ఎంతగా తల్లడిల్లిపోతుందో  బిఎన్ .. .. మన మనసు తలుపు తట్టి పిలిచి .. .. మరీ చూపించారు. ఒక్క ఆ సినిమానే కాదు .. ..బంగారు పాప, పూజాఫలం, రాజమకుటం వంటి సదా నిలిచిపోయే సినిమాలూ మనకిచ్చారు బిఎన్ రెడ్డి. ఎన్నో కళాఖండాలను మనకందించిన బిఎన్ రెడ్డి .. .. తన జీవితం మలిసంధ్యలో ఒక మాటన్నారు. తనకు తృప్తి కలిగించేలా ది బెస్ట్ అనదగ్గ సినిమా తను తీయనే లేదట.

బిఎన్ రెడ్డి ఒప్పుకోకపోయినా  ఆయన  అందించినవన్నీ  ది బెస్ట్  లే కదా. ఇప్పుడు బిఎన్ రెడ్డి వంటి మహనీయులూ లేరు. ఆ విలువలూ లేవు. తెలుగు సినిమా ప్రాభవ వైభవాలకు ప్రతీకలుగా నిలిచి ప్రకాశించిన మహనీయమూర్తులలో బి ఎన్ రెడ్డి ఒకరు. ఆయనలా  మేలిమి ముత్యాల్లాంటి సినిమాలు తీయలేక పోయినా .. .. కనీసం ఆ దరిదాపుల్లో నైనా సినిమాలు తీస్తే అదే .. ..  ఆ మహామనిషికి మనం అర్పించే నిజమైన   నివాళి అవుతుంది.

Leave a Reply

Your email address will not be published.