‘బసవరామ తారక పుత్ర’ బాలకృష్ణ

సినిమావారికి సెంటిమెంట్స్ ఎక్కువ. నటీనటుల పేరు విషయంలో కూడా దాన్ని పాటిస్తారు. ఒకసారి తెరమీద ఎవరి పేరు ఎలా వేస్తే అదే తీరు అన్ని సినిమాలకూ కంటిన్యూ అవుతుంది. ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో వస్తూంది. అయితే గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం టైటిల్స్ లో బాలకృష్ణ పేరు మరోవిధంగా కనబడుతుందని  దర్శకుడు క్రిష్ చెప్పాడు. అందుకు కారణం కూడా చెప్పాడు.

పేరుకు ముందు ఇంటి పేరు చేర్చుకునేవారు కొందరైతే… ముందు తన పేరు ఆ తర్వాత ఇంటిపేరు రాసుకునేవారు మరికొందరు. సినిమా వారిలో కొందరు తప్పనిసరిగా ఇంటిపేరు పూర్తిగా కానీ, పొడి అక్షరాల్లో కానీ వాడతారు.  ఆ రోజుల్లో నాగేశ్వరరావు, రామారావులకు సినిమా టైటిల్స్ లో వారి ఇంటిపేరు తప్పనిసరిగా ఉండేది. అలాగే బాలకృష్ణ సినిమాల్లో తప్పనిసరిగా … నందమూరి బాలకృష్ణ అని వేస్తున్నారు.

బాలకృష్ణ నటిస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో అతని పేరుకు ముందు నందమూరి అని ఉండదు. బసవరామ తారక పుత్ర బాలకృష్ణ అని ఉంటుందట. అలా ఎందుకు మార్చాల్సి వచ్చిందో కారణం వివరించాడు దర్శకుడు క్రిష్. సమాజంలో  పితృస్వామ్యం ప్రారంభమైనప్పుడు పిల్లలపేర్ల ముందు తండ్రి పేరు ఉండేది. అంతకు ముందు మాతృస్వామ్యం రోజుల్లో ఎవరి పేరైనా తల్లి పేరుతోనే ప్రారంభమయ్యేదట.

బాలకృష్ణ నటిస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం కథ మాతృస్వామ్యం కాలం నాటిది. అందుకే శాతకర్ణి పేరుకు ముందు ఆయన తల్లి గౌతమి పేరు ఉంది. ఆమె పుత్రుడు కాబట్టి … గౌతమీపుత్ర శాతకర్ణి నాయధేయమే ప్రాచుర్యంలోకి వచ్చిందని, తల్లి పేరే ఇంటిపేరు అయిందని ఆ చిత్ర దర్శకుడు క్రిష్ చెప్పాడు. తన సినిమాలో నటీనటుల పేర్లు వేసేటప్పుడు ఆనాటి పద్ధతినే అనుసరిస్తున్నానని తెలిపాడు క్రిష్.

బాలకృష్ణ పేరుమాదిరే తమ యూనిట్ లో ఇతరుల పేర్లు కూడా కొత్త తరహాలో తెరపై వేస్తున్నారని క్లిష్ చెప్పాడు. తన పేరు కూడా అంజనాపుత్ర క్రిష్ అని ఉంటుందట.

Leave a Reply

Your email address will not be published.