గవర్నర్ ను కలసిన అఖిలేశ్

  • పార్టీలో కొనసాగుతున్న అంతర్గత సంక్షోభం

లక్నో: ఉత్తర ప్రదేశ్ లో అధికారపక్షమైన సమాజ్ వాది పార్టీలో సంక్షోభం నివురుగప్పిన నిప్పులానే ఉంది. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ గవర్నర్ రామ్ నాయక్ ను కలసుకోవడం సర్వత్రా ఉత్కంఠను రేకెత్తించింది. అఖిలేశ్ రాజీనామా చేస్తారా అన్న ఊహాగానాలు కూడా వ్యాపించాయి. పార్టీలో, ప్రభుత్వంలో నెలకొన్న అస్థిరత్వ స్థితిని అవకాశంగా తీసుకుని ముఖ్యమంత్రిని లక్ష్యం చేసుకుని బీజేపీ పావులు కదపడం ప్రారంభించిందనీ, ఆయన ప్రభుత్వానికి తగినంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందా అన్న ప్రశ్న లేవనెత్తడం ద్వారా అవిశ్వాస తీర్మానాన్ని ముందుకు తెచ్చే అవకాశాన్ని సూచిందనీ విశ్లేషకులు అంటున్నారు.

బీజేపీ ప్రయత్నాన్ని ముందే అడ్డుకుంటూ తనకు తగినంత మద్దతు ఉందని చెప్పడానికే ముఖ్యమంత్రి గవర్నర్ ను కలిశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 403 స్థానాలున్న అసెంబ్లీలో సమాజ్ వాది పార్టీ 224 మంది ఎమ్మెల్యేల బలంతో అధికారం లోకి వచ్చింది. వీరిలో కనీసం 185 మంది అఖిలేశ్ కు మద్దతు ఇస్తున్నట్టు చెబుతున్నారు. శాసనసభాపక్షంలో ప్రస్తుతమున్న పరిస్థితి గురించి ఇతర పరిణామాల గురించి వివరించడానికే అఖిలేశ్ గవర్నర్ కలిశారని మరో ఊహాగానం. ఇలా ఉండగా అఖిలేశ్ కు సన్నిహితుడైన ఒక మంత్రిని పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు శివ్ పాల్ యాదవ్ పార్టీనుంచి ఆరేళ్లపాటు బహిష్కరించారు. మంత్రిగా తన అధికారనివాసాన్ని కూడా ఆయన ఖాళీ చేశారు.

Leave a Reply

Your email address will not be published.