నటనే ఆయనకు ప్రాణం

అనన్య సామాన్యమైన ప్రతిభావంతులు కొందరుంటారు. తాము కోరుకున్న రంగంలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి శిఖరస్థాయికి చేరుకుంటారు. అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్ఠలు అర్జిస్తారు. అదే కోవలోకి అక్కినేని నాగేశ్వరరావు వస్తారు.

ఓ పేదింటి కుర్రవాడు శిఖరస్థాయిని చేరుకుంటాడని ఆ రోజు ఎవ్వరూ అనుకోలేదు, ఊహించనూ లేదు. ఆ విజయాల వెనక ఓ తపన ఉంది. అంతులేని కృషి ఉంది. జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలూ ఉన్నాయి. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా మంచి క్రమశిక్షణతో, ఆత్మబలంతో ఆయన ముందుకు అడుగు వేశారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తూ ఈ ప్రత్యేక కథనం.

తెలుగు సినీచరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు ఒక శకం. ఆయన ఓ మేరువు. ఓ లెజెండ్‌. అక్కినేని నటసామ్రాట్‌ మాత్రమే కాదు, తెలుగు సినిమా సామ్రాట్‌  కూడా. ఆయన సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తాను సినీరంగంతో పాటే అడుగులు వేశారు. ఆ తర్వాత దాన్ని తనే చెయ్యిపట్టి నడిపించారు. తెలుగు సినిమా చరిత్రతో నాగేశ్వరరావు మమేకమయ్యారు. చిత్రసీమలో ఎన్నో మజిలీలు చేశారు. మలుపులు చూశారు. అంచెలంచెలుగా ఎదిగి నటశిఖరం చేరుకున్నారు.

 

నాటకాలతో  నటనారంగానికి  వచ్చిన అక్కినేని 75 ఏళ్ల  సుదీర్ఘమైన నటజీవితం గడిపారు. రొమాంటిక్‌ పాత్రలకు నాగేశ్వరరావు పెట్టింది పేరు. విషాదాంత ప్రేమ కథా నాయకుడిగా అక్కినేని ఎన్నో సినిమాల్లో వేశారు. లవ్‌ సీన్స్‌, మానసిక సంఘర్షణ ఉన్న సన్నివేశాల్లో నటించడంలో నాగేశ్వరరావు తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఆయన రొమాంటిక్ హీరో, ట్రాజెడీ కింగ్‌ అనీ అంటారు. అమ్మాయిలకు ఆ రోజుల్లో ఏఎన్నార్ కలల హీరో, డ్రీంబాయ్‌. అరవై ఏళ్ల వయసులో కూడా ఇరవై ఏళ్ల కుర్రాడిగా హుషారుగా నటించడం ఆయనకే చెల్లింది.

ఏదోక రకంగా నటించి వెళ్లిపోవడం వేరు. కేరక్టర్ కు న్యాయం చేసి, జీవం పోసి నటించడం వేరు. అక్కినేని ఏ పాత్ర అయినా అది తనే అనుకొని మమేకమై నటించారు. అందుకే ఆయన నటనతో ఆయా పాత్రలు ప్రాణం పోసుకున్నాయి. పాత్రోచితమైన నటనను ప్రదర్శించిన అక్కినేని మహేనటుడు. మొదట్లో ఆయన్ని అసలు సినిమాలకే పనికిరాడు అని కొందరన్నారు. కానీ, ఆ తర్వాత ఆక్కినేనే లేనిదే తెలుగు సినిమా లేదు అన్న ఎత్తుకి ఎదిగారు.

తెలుగు సినిమాకు అక్కినేని నాగేశ్వరరావు వెలకట్టలేని విలువైన ఆణిముత్యం. ఆయన నటన చిరస్మరణీయం. అక్కినేని జయంతి సందర్భంగా మరోసారి ఆ మహానటునికి అంజలి ఘటిస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published.