ధనుష్ తమ కొడుకే నంటూ పిటిషన్

సినీరంగంలో అప్పుడప్పుడు  రకరకాలుగా, వివిధ కారణాల వల్ల వివాదాలు వస్తుంటాయి. అవి మనీకి సంబంధించినవి కావచ్చు. లేదా కథకు సంబంధించినవి కావచ్చు. ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లోనూ  కావచ్చు. అయితే  కోలీవుడ్ లో ఎవరూ ఊహించని కాంట్రవర్సీ ఒకటి వచ్చింది. ఓ నటుడు తమ కుమారుడేనంటూ ఓ జంట కోర్టు కెక్కింది.

‘కొలవరి కొలవరి’ పాటతో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకొన్న నటుడు, గాయకుడు ధనుష్‌. కోట్లాదిమంది నోట ఆ పాట ప్రతిధ్వనించింది. అతనికి ఎనలేని కీర్తిని తెచ్చింది. రజనీకాంత్ అల్లుడిగా అతను ఆ ఫేమ్ ను సంపాదించాడని కొందరన్నా, తనకున్న వెర్సెటైల్ టాలెంట్ తో కోలీవుడ్ లో నెగ్గుకొచ్చాడు ధనుష్‌. ధనుష్ తో సినిమాలు తీయడానికి,  అతనితో నటించడానికి ఎంతోమంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

క్రేజీ స్టార్ ధనుష్ స్క్రీన్ పై ఎన్నో ట్విస్ట్ లున్న కేరక్టర్స్ వేశాడు. కానీ ఇప్పుడు అతని లైఫ్ లోనే పెద్ద ట్విస్ట్ వచ్చింది. ధనుష్‌ తమ  కొడుకేనంటూ మదురై జిల్లా మేలూరు  మండలం ఆమలంపట్టికి చెందిన కదిరేశన్‌, మీనాళ్‌ దంపతులు మేలూరు మేజిస్ట్రేట్‌ కోర్టులో  పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై ప్రాథమిక విచారణ జరిపిన న్యాయస్థానం వచ్చే  జనవరి 12న ధనుష్  స్వయంగా కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.

ధనుష్‌ తమ కొడుకని, అతని అసలు పేరు కలైసెల్వన్‌  అని కదిరేశన్‌, మీనాళ్‌ దంపతులు పిటిషన్ లో వెల్లడించారు. చదువుకోవడం లేదని తమ కొడుకును చిన్పప్పుడు మందలించామని, దాంతో వాడికి కోపం వచ్చిందని వారు చెప్పారు. సినిమాల్లో నటించడానికి చెన్నై వెళుతున్నానని, తన కోసం వెతకవద్దని లేఖ రాసి వెళ్లిపోయాడని ఆ వృద్ధ దంపతులు  పిటిషన్ లో  పేర్కొన్నారు.

తామిప్పుడు వృద్ధాప్యంలో ఉన్నామని, కొడుకు దగ్గరుండాలని అనుకుంటున్నామని కదిరేశన్‌, మీనాళ్‌  ఆ పిటిషన్ లో తెలిపారు.  ధనుష్‌ తమ బిడ్డే అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయని,  అంతగా అవసరమైతే డీఎన్‌ఏ పరీక్షలకు కూడా రెడీ అని చెప్పారు. అదివరకు ధనుష్‌ పెళ్లి సమయంలో కూడా ఓ వ్యక్తి ధనుష్‌ తన కొడుకని, అతన్ని  అప్పగించాలని డిమాండ్ చేస్తే  ధనుష్‌ తండ్రి, దర్శకుడు కస్తూరిరాజా పోలీసులకు ఫిర్యాదు  చేశాడు.

Leave a Reply

Your email address will not be published.