ఎన్ కౌంటర్ లో సిమి ఖైదీలు హతం

  • భోపాల్ సెంట్రల్ జైలునుంచి పారిపోయిన కొన్ని గంటల్లోనే

భోపాల్: సోమవారం ఉదయం భోపాల్ సెంట్రల్ జైలునుంచి తప్పించుకున్న ఎనిమిది మంది సిమి (స్టూడెంట్స్ ఆఫ్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా) ఖైదీలను ఎయింత్ఖెడి గ్రామంలో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమార్చినట్టు భోపాల్ పోలీస్ ఐజీ యోగేశ్ చౌదరి చెప్పారు. వారు పోలీసుల మీద కాల్పులు జరగపగా పోలీసులు వారిపై ఎదురు కాల్పులు జరిపారని ఆయన చెప్పారు.

విజయవంతంగా ఖైదీలను వెంటాడినందుకు ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్ పోలీసులను అభినందించారు. ఖైదీలు జైలునుంచి పారిపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఈ ఘటన గురించి ఆయన కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కూడా తెలియబరిచారని, దీనిపై జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్ఐఏ) తో దర్యాప్తు జరిపించాలని కోరారనీ, హోమ్ మంత్రి ఒప్పుకున్నారనీ వార్తాసంస్థల భోగట్టా.

అంతకుముందు ఎనిమిది మంది ఖైదీలూ ఒక కానిస్టేబుల్ ను కట్టి పడేసి, ఒక హెడ్ కానిస్టేబుల్ గొంతు కోసి  చంపి, కలిపి కట్టిన బెడ్ షీట్ల సాయంతో గోడ దూకి పారిపోయారు. వీరిని అంజాద్, జాకీర్ హుస్సేన్, మహమ్మద్ సాలిక్, ముజీబ్ షేక్, మెహబూబ్ గుడ్డు, మహమ్మద్ ఖలీడ్ అహ్మద్, అకీల్, మజీద్ లుగా గుర్తించారు.

భద్రతా లోపాల కారణంగా జైళ్ల డీఐజీ, అడిషనల్ డిఐజిలతో సహా అయిదుగురు జైలు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ ఘటన తర్వాత జైలు భద్రతావ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసినట్టు సెంట్రల్ జైల్ డైరెక్టర్ జనరల్ చెప్పారు. రాష్ట్రంలో విచారణను ఎదుర్కొంటున్న సిమి ఖైదీలలో చాలామందిని భోపాల్ సెంట్రల్ జైలుకు తరలించారు. మూడేళ్లక్రితం రాష్ట్రంలోని ఖాండ్వా జైలునుంచి ఏడుగురు సిమి ఖైదీలు ఇలాగే పారిపోయారు. ఆ తర్వాత వారిలో అయిదుగురు మళ్ళీ పట్టుబడగా, ఇద్దరు గత సంవత్సరం తెలంగాణ పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించారు. సిమి నిషిద్ధసంస్థ అన్న సంగతి తెలిసినదే.

Leave a Reply

Your email address will not be published.