66లోకి అడుగుపెడుతున్న షబానా అజ్మీ

మనకు కమర్షియల్ సినిమా, ఆర్ట్ ఫిలిం అని డిఫరెంట్ షేడ్స్ ఉన్న రెండు రకాల   సినిమాలున్నాయి. ఆర్ట్ ఫిలిం అనగానే చాలామందికి వెంటనే గుర్తొచ్చే నటి షబానా అజ్మీ. సహజత్వానికి చాలా దగ్గరగా ఉండే ఎన్నో కళాత్మక సినిమాల్లో… అంటే ఆర్ట్ పిక్చర్స్ లో అతి సహజమైన పాత్రల్లో జీవించే నటి షబానా అజ్మీ. తన అసమానమైన నటనతో కళాత్మక చిత్రాలకు నిర్వచనంగా మారిన షబానా అజ్మీకి  ప్రైమ్ పోస్ట్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతుంది.

పార్లలర్ సినిమా అంటే సమాంతర సినిమా లేదా ఆర్ట్ ఫిలిం. బెంగాల్ లో న్యూవేవ్ మూవ్ మెంట్ నుంచి సమాంతర సినిమా పుట్టింది. ఆ తర్వాత ఓ ఉద్యమంలా సాగి బలపడి స్థిరపడింది. ఈ తరహా సినిమాలకు తన నటనతో ఊపిరి పోసిన నటి షబానా అజ్మీ. నియో రియలిజంతో సీరియస్ గా సాగే ఇలాంటి సినిమాల ద్వారానే షబానా ఎంతో పేరు తెచ్చుకుంది. షబానా వంటి సహజ నటి  ఈ తరంలో లేరనే చెప్పాలి. ఈ జనరేషన్ సంగతేమో కానీ, ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ పొందడం నటీనటులకు అప్పట్లో ఓ క్వాలిఫికేషన్. నటనలో ఓనమాలు నేర్చుకోవడానికే కాక, పరిణతిని సాధించేందుకు కూడా ఉపయోగపడేది ఆ శిక్షణ. షబానా కూడా అలా శిక్షణ పొందిన నటి కనుకనే నటించిన ప్రతి సినిమాలోనూ సహజత్వానికి ప్రతీకగా నిలిచింది.

1974లో అంకూర్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన షబానా ఆ తర్వాత ఆర్ట్ సినిమాల హీరోయిన్ అయింది. ఆమె నటించిన పాత్రలు జీవితానికి దగ్గరగా ఉంటాయి. సామాన్యుల కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు ఆమె పాత్రలతో పెనవేసుకున్నాయి. షబానా అజ్మీకి, ఆమె నటించిన సినిమాలకు అవార్డులు వచ్చాయి. షబానా చాలాసార్లు ఉత్తమ నటిగా జాతీయ ఫిలిం అవార్డుల్ని,  ఫిలింఫేర్ అవార్డుల్ని సొంతం చేసుకుంది. అంతర్జాతీయ స్థాయి అవార్డులూ గెలుచుకుంది. సమాజం పట్ల తన బాధ్యతను గుర్తించిన షబానా అజ్మీ అనేక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది. షబానా జీవితంలో నటన ఒక భాగమైతే, సామాజిక సేవ మరో భాగం. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెడుతున్న షబానా అజ్మీకి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published.