మొహంజదారోకి మొట్టికాయలు

దాదాపు రూ. 100 కోట్ల వ్యయంతో అత్యంత భారీగా తెరకెక్కిన చిత్రం మొహెంజోదారో. హృతిక్ రోషన్, పూజా హెడ్గేలు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారికర్  తెరకెక్కించాడు. సింధు నాగరికత కాలాన్ని ఆవిష్కరిస్తున్నా అంటూ ప్రచారం చేశారు. అయితే ఈ చిత్రం  విడుదల తర్వాత ఫ్లాప్ టాక్ ని దక్కించుకోగా. ఈ చిత్రంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటం  దర్శకుడికి అదనపు తలనొప్పిగా మారింది.

లగాన్, జోథా అక్బర్ లాంటి చిత్రాలు తీసిన దర్శకుడు అశుతోష్ గోవారికర్. ఈ దర్శకుడు మోహెంజాదారో చిత్రంతో మరో భారీ హిట్ కొట్టబోతున్నాడన్న ప్రచారం జరిగింది. విడుదల తర్వాత సినిమా ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మొహెంజోదారో భారీ ఎత్తున నష్టాలు మిగిల్చింది. నష్టాలను ఎలా భర్తీ చేసుకోవాలా అని తలపట్టుకుంటూ ఉంటే, మూలిగే నక్క మీద తాటిపండులా పాకిస్థాన్ నుంచి  కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

మొహెంజోదారో చిత్రం చరిత్రను వక్రీకరించినట్టుగా ఉందని సింధు ప్రాంత నాగరికతను కించపరచే విధంగా ఉందని సాంస్కృతిక, పర్యాటక మంత్రి సర్దార్ అలీషా విమర్శలు గుప్పిస్తున్నారు. పాక్ లోని ప్రముఖ పత్రిక డాన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చిత్రంపై విమర్శలు చేశారు. ఐదువేల ఏళ్ల నాటి సింధు నాగరికతను కించపరచే విధంగా ఈ చిత్రం తెరకెక్కించారు అన్నారు. ఈ సినిమాలో వాస్తవాలకన్నా దర్శకుడి కల్పనలే ఎక్కువగా ఉన్నాయనీ దీంతో సింధు ప్రజలు ఎంతో అసంతృప్తిగా ఉన్నారని అలీషా అన్నారు. ఈ అభ్యంతరాలను దర్శకుడు అశుతోష్ గోవారికర్ కు చెబుతా అంటున్నారు.

సినిమా ద్వారా సింధు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా సినిమా తీసిన దర్శకుడు అశుతోష్ పాక్ ప్రజలకు ముందుగా క్షమాపణలు చెప్పాలని అలీషా డిమాండ్ చేయడం విశేషం. సింధు నాగరికతకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుందనీ అందుకే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా సింధుకు గుర్తింపు ఉందని అన్నారు. వాస్తవాలను వక్రీకరించినందుకు క్షమాపణలు చెప్పాలని అలీషా పట్టబుడుతున్నారు.

Please follow us on [button color=”dark blue” link=”https://www.facebook.com/primepostindia/” target=”_blank” icon=”momizat-icon-facebook”]Facebook[/button]  [button color=”blue” link=”https://twitter.com/Primepostindia” target=”_blank” icon=”momizat-icon-twitter”]Twitter[/button]

Leave a Reply

Your email address will not be published.