ప్రియాంకా.. నీవు జియో సిమ్ కోసం అప్లై చేశావా?

ఇటీవల బంపర్ ఆఫర్‌తో యూజర్ల అందరిని తన వైపుకి తిప్పుకున్న జియో నెట్ వర్క్. ముఖేష్ అంబానీ డిజిటల్ ఇండియాలో భాగంగా ఇటీవల ప్రారంభించిన జియో కస్టమర్స్ అందరిని ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జియో సిమ్‌ల కోసం రిలయన్స్ షాపుల దగ్గర జనాలు బారులు తీరుతున్నారు. ఈ రోజుల్లో అందరు స్మార్ట్ ఫోన్‌తోనే ఆన్ లైన్ వ్యవహారాలు చేసుకుంటున్న నేపధ్యంలో జియో సిమ్ వారికి చాలా ఉపయోగపడుతుందనేది కొందరి వాదన. అయితే ఓ స్టార్ హీరోయిన్ కూడా జియో సిమ్ కోసం అప్లై చేసిందనే వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

బంఫర్ ఆఫర్లతో స్మార్ట్‑ఫోన్ యూజర్ల ముందుకు వచ్చిన రిలయన్స్ జియో సిమ్‑కోసం బారులు తీరుతున్న జనాన్ని ఓ వైపు చూస్తుండగానే, మరోవైపు ఓ టాప్ బాలీవుడ్ భామ జియో సిమ్ అప్లికేషన్ సోషల్ మీడియాలో హల్‑చల్ చేస్తోంది. ప్రియాంక చోప్రా జియో సిమ్ కోసం అప్లై చేసిన మాదిరిగా అచ్చం ఆమె ఫోటోతోనే ఓ దరఖాస్తు ఫామ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ దరఖాస్తు ఫామ్‑లో అన్ని వివరాలు ఈ అందాల తారవే ఉండగా, సంతకం మాత్రం భిన్నంగా ఉందట. 

సిమ్ అప్లై చేసిన ప్రతి దరఖాస్తుదారుని వివరాలు గోప్యంగా ఉంటాయి. కానీ ఓ నటీమణికి సంబంధించిన వివరాలే ఇంటర్నెట్‑లో బ్రేకింగ్‑లా అందుబాటులోకి రావడంతో దానిలో నిజమెంతో ఉందో తెలియక విశ్వసనీయతపై ఆమె ఫ్యాన్స్ ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రియాంకా.. నీవు జియో సిమ్ కోసం అప్లై చేశావా  అంటూ ట్వీట్‑ చేస్తున్నారట. మొదట ఆ ఫోటోతో కూడిన అప్లికేషన్ పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‑లో చక్కర్లు కొట్టిందట.

టారిఫ్‑లపై బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ జియో ప్లాన్‑ను వివరించిన ముకేశ్ అంబానీని ప్రియాంక చోప్రా కొనియాడిన సంగతి తెలిసిందే.  డిజిటల్ ఇండియాలో జియో విజన్ ఖచ్చితంగా నెరవేరాలని ఆశిస్తున్నట్టు నీతాకు, ముకేశ్‑కు, జియో టీమ్‑కు ప్రియాంక అభినందనలు తెలిపారు. ప్రియాంకతో పాటు రిలయన్స్ జియో లాంచింగ్‑పై అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ కూడా ట్వీట్ చేశారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‑చల్ చేస్తున్న ఈ అప్లికేషన్ ఫామ్‑తో ప్రియాంక నిజంగా జియో సిమ్‑కు అప్లై చేసిందా లేదా అది తప్పుడు అప్లికేషన్ ఫామా అనేది తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published.