అమ్మకి బాలయ్య గిఫ్ట్

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన వందో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. గౌతమీ పుత్ర శాతకర్ణి పేరుతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిస్తున్నారు. అందుకే సినిమాలో కీలకమైన శాతకర్ణి తల్లి పాత్రకు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలినిని తీసుకున్నారు.  ఈ చిత్రంలో హేమ మాలిని బాలయ్యకు తల్లిగా నటిస్తోంది. అయితే తొలి రోజు షెడ్యూల్‌లో బాలయ్య  ఈ డీమ్‌ గర్ల్‌ కి షాకింగ్ గిఫ్ట్‌ ఇచ్చాడట.

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. గతంలో యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించగా, ఇప్పుడు రాజకోటలకు సంబంధించిన సీన్స్ దర్శకుడు క్రిష్ పిక్చరైజ్ చేస్తున్నాడు. గత షెడ్యూల్స్ వరకూ బాలయ్య సింగిల్ హ్యాండ్ తో షూటింగ్ నడిపించేయగా, తాజా షెడ్యూల్ లో శాతకర్ణి తల్లి గౌతమి పాత్రలో నటిస్తున్న హేమమాలిని, భార్య రోల్ లో చేస్తున్న శ్రియ కూడా జాయిన్ అయ్యారు.

బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని తొలి రోజు షూటింగ్ కి రాగానే, నందమూరి హీరో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారట. తను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోనే నేసిన లేపాక్షి చీరను హేమమాలినికి ప్రెజెంట్ చేశారట బాలయ్య. ఈ నందమూరి హీరో తనకు ఇచ్చిన ప్రాధాన్యత విలువ చూసి, ఆ బాలీవుడ్ నటి చాలా సంతోషించారట కూడా. అంతే కాదు గతంలో సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి తాను రెండు సినిమాలు చేసినప్పటి సంగతులను కూడా హేమమాలిని పంచుకున్నారట.

ఎన్టీఆర్ తో కలిసి నాలుగు దశాబ్ధాల క్రితం పాండవ వనవాసం, శ్రీకృష్ణ విజయం చిత్రాల్లో నటించారు హేమమాలిని. ఆ రెండు పౌరాణికాలు కాగా, ఇప్పుడు మళ్లీ రాజుల కాలానికి సంబంధించిన చిత్రంలో ఈమె తిరిగి తెలుగులో నటిస్తుండడం విశేషం. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని కోటల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కుతుండగా, 2017 సంక్రాంతికి గౌతమిపుత్ర శాతకర్ణి విడుదల కానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానులలో భారీ హైప్ పెరిగిపోగా అభిమానులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.